నేస్తాలు....!

 






శీర్షిక : నేస్తాలు....!


నిశీధి, భానుడు, ఘని, ధుని, 

పడతి, అని రాస్తున్నప్పుడు


ముసి ముసిగా 

దాపున కూసోని నవ్వుతున్నడు తగుళ్ల గోపాల్ అన్న

తప్పంటే ఏమన్నా తప్పుతీసుకుంటడో ఏమో తమ్ముడు అని


సర్రున ఇపుల సరిసి 

కోపం సేస్తుండు నాగిల్ల రమేష్ అన్న

ఎన్ని సార్లు సేప్పిన చెవిన ఎక్కదురా నీకు అని


ఎన్నో ఎవలో అన్నది నూవిన్నది కాదురా

నీ బతుకు సిత్రాన్ని శాత్రంగా మలువు అంటడు అన్వర్ భాయి


సాయిబుల బాస

ఎంత పొంకంగా ఉంటదయ్య ఇదేం రాసినవ్

అసహనపు కనుల ముడి విప్పారిస్తూ అంటది దాసోజు లలితక్క


పదం పల్లె పానాది పొంట 

పసి మొగ్గలు విప్పుకుంటున్నట్లు

ముండ్ల దాపున దాక్కున్న రేగు పండ్లను 

నేర్పుగా ఒడిసి, రుమాలులో పోసుకునే నీ పదాలు 

నలుగురికి పంచాలయ అంటాడు యాకుబ్ చాచా


శిలాలోలితమ్మి 

నీ కవితలన్నీ కవి సంగమంలో తూర్పార బట్టు గట్టి 

భావాలు మనసులో ఆగి తాలు మల్కులకెళ్లి ఉరుకుద్ది అంటది


ఇగ వశం గాక చీర బొంత తలాపునేసి 

ఇంటి ముందల నులక మంచంల ఒరుసుక

పన్న నాకు పాణం అసొంటి దోస్త్ గాళ్ళు గట్టిగ కొట్టి లేపిర్రు


గవే "దండకడియం", "నల్ల కోడిసె వన్నేకాడు" 

అవి ముందల ఏసుకుంటే నెత్తి గిన్నెల గడ్డ 

కట్టిన కన్నీటి తడ కాలువలై కింద పారాడాయి


గుండెలో గోర్లతోనే గుంతలు తీసి నాటినట్లు

ఒక్కో అక్షరం కొత్త పదాల మొలకలు పూయిస్తున్నాయి


పదును గల్ల పదాలను సద్ది గట్టి 

ఒడుపుగా గుండెల దాసుకోమంటున్నాయి

బుద్ధి కుండను ఆలోచనల ఆవిర్ల మండించి 

బెల్లం బువ్వసొంటి మాటలు పుట్టిస్తున్నాయి


పల్లె నెత్తురు మడుగులు దాటి 

పట్నంల దిగాలుగున్న నాకు కలల చిత్రాలన్నీ 

కళ్ల ముందర గోళీలు, టప్పాలు, డక్కెన్లు ఆడే 

పసి పొరగాళ్ళ లెక్క స్ఫురిస్తున్నాయి


తెగి పడిన నా పల్లె పేగును 

మోదుగాకుల సుట్టి వేప పుల్లతో 

అంటు కుంటాలనే ఆరాటం మనసున వడ్డది


ఆప పెండ్లికి అమ్మిన 

రెండేకరాలతో మా బతుకు 

బర్కతి పోటువా చితల్ చితలయ్యింది


బడికి సెలవు రాంగానే 

అమ్మితో పోయిన 5 రూపాల కూలి

నా బతుకు తీగకు కట్టెల పందిరి లెక్క దాపు అయ్యింది


నా సదువు సమరమే అని చెప్పాలి

చంద్రబాబు నాయుడు ఇచ్చిన 

గ్యాస్ పొయ్యి అమ్మకానికి పోయి 

అంగు లాగు, బడి పుస్తకాలయ్యింది


ఆడీడ దేవులాడిన 

హండిల్, పయ్యలతో అతికిన బొంత 

సైకిల్ మీద కోమటోళ్ళ శ్యామ్ సుందర్ తాత పేరు


ఇప్పటికీ నాకు గుర్తే రాను బోను 

16 కిలో మీటర్లు జేబుల పైసా లేకుండా 

5 ఏండ్లు ఆకలి మంట తెల్వకుంట అక్షరాల బువ్వ పెట్టింది 

ఈ రెండు పయ్యల మిత్రుడే


రెక్కలు దాయకుండా 

చెన్ల కలుపు పీకి పత్తి తీసినా నారు మోసిన కాన్నుంచి 

మెద కట్టి, కుప్ప పెట్టి, కల్లంల వడ్లు తీసినా


కోమట్ల బాబు సేటు కాడ 

బెల్లం బుట్టలు, యూరియా బస్తాలు మోసినా


ఆ కష్టమే

నా కంచంల మెతుకై పక్కొని 

గాయానికి గూడా పసరు కొమ్మై సాయపడుమన్నది


ఇప్పుడు ఆ కన్నీళ్ళే నా కవితా వస్తువులు


దండకడియం, నల్లకోడిసె వన్నెకాడు 

నా నేస్తాలైతే తగుళ్ళ గోపాల్, నాగిళ్ళ రమేష్ 

అన్నలు నా తోబుట్టువులు అయ్యిర్రు....!


రచన : తాజ్

9581114146

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...