ఒంటి నిట్టాడు గుడిసె







ఒంటి నిట్టాడు గుడిసె

................................................✨

ఇగో ఇక్కన్నె

వాన జల్లుకు వణుకుతూ

రెక్కల సంటి పిల్లల్ని ఒదిగిన 

తల్లి కోడోలె చూరు నీళ్లు రాలుస్తూ 

మా ఒంటి నిట్టాడు గుడిసె ఉండేది


ఒళ్ళంతా నల్ల మట్టి రాసుకుని 

తెల్లని గీతల గంధం పూసుకుని

పీర్ల పండుగ షర్బత్ పటవ చిమ్మటించినట్టు 

ఎప్పుడు చెరువు అలుగువడ్డా 

బురద నీరు మా గుడిసెలకు రాగానే తేటగా పారేది


వానెలిసే దాక కాలు కింద పెట్టనియ్యక

నులక మంచం చూరు సుక్కల తాళమేస్తూ నిద్ర పుచ్చేది


ఈ తూర్పు మూలకు ఎర్రమన్నలికిన

మూడు రాళ్ళ పొయ్యి ఉండేది

ముదునష్టపు వాన ఎప్పుడు పోతదో అని 

దాది పచ్చి కట్టెలు పొయిల వెడుతుంటే 

వాన మిత్రుని వెనకేసుకొస్తున్నట్టు 

చిట పటమని అగ్గి రాజేసుకునేది


ఎసరు వంపిన గంజి నీళ్ళే కడుపు నిండెది 

అన్నం వద్దే వద్దు అనేటోల్లం

దాని కుడిబాజు వాసానికి జనపనార ఉట్టి

బువ్వ పెళ్ళ నెత్తి నేసుకుని చూసేది

మాపటికి సుట్టం ఎవలన్న వస్తరెమో అని


అక్క పుట్టినప్పుడే వానలకు

మట్టి గోడ మెత్తబడి బయటి బాజుకు కూలింది

ఆడపిల్ల మీద అల్లా వెలుగు దీవెనలిస్తున్నట్టు

ఆయాల్ల గోడ మీదపడ్డా ఈ కట్టం తప్పేదిరా అని

అమ్మి గోడేళ్ల పొస్తది మతిలపడ్డప్పుడల్ల


ఇంత చిన్న గుడిసెల

తల్లితోని ఎనమండురం ఎట్ల పట్టినమో

ఒకల కడుపుల ఒకలం తలకాయపెట్టి

ఒకరి కాళ్ళు ఇంకొకలకు నెత్తి బట్ట జేసి


అమ్మి అబ్బా పనికి పోయి అచ్చేటాలకు 

ఇల్లు ఆకిలి ఊడ్చి, బువ్వ గిన్నెలుకడిగి ఉంచేది

వేడి నీళ్లకు పొయ్యిలో కట్టెలు ఎగనూకుతూ


మాపటీలి పెద్దోళ్ళు వచ్చేదాక

ఒక పక్క పట్నం తుమ్మ చెట్టు

మరో పక్క రేగు చెట్టు మాకు గస్తీ కాస్తూ ఉండేవి


గుడిసె ఎనక బాజు చింత చెట్టు ఉండేది

తీరొక్క జీవాలకు రచ్చ బండ పరిచి 

వాటి తగాదా తెగేది మా గోలెంల నీళ్లు తాగినంకనే


మేము గుడిసెలకచ్చుడేందో గాని

అందరూ కొత్త తావున దీపాలు ముట్టిత్తరు కదా

మా అమ్మిని మాత్రం తేలు ముట్టింది


రాత్రికి మట్టి దుగిట్ల కిర్సనాయిల్ దీపం పెడ్తే

సూరు సందులకెంచి బంగారు వెలుగు రేఖలు పారెది

గుడిసె చుట్టూ రెక్కల పురుగులు

గోలెం కాడ చిమ్మట్లు దరువందుకునేది "రాత్రంతా"


ఈ గుడిసెల ఉన్నన్ని రోజులు

ఎన్ను పూస నిట్టాడై నిలబడింది అమ్మి

పక్క బొక్కల వాసాలు జేసి కడుపుల దాసుకున్నది


మా గడ్డి గుడిసంటే ఎంత పాయిరమో

పీర్ల పండుగకు పోయినపుడు बीवी కి చెప్తుంటే 

కన్నులు ఒంపుకుంట గుండెపై వాలింది ఓదారుస్తున్నట్టు...!


మహమ్మద్ తాజ్ 

9581114146


बीवी - భార్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...