వాకిలి కొమ్ము....!

 


పొద్దాక పని చేసి అలిసి గూడు చేరగానే

ఎదురుగా గులాబి సెట్టు

Bunches Bunches గా విరగపూసి

స్వాగత తోరణం కడుతుంది 


పక్కనే తులసి కోట

కనబడని దేవేరులకు ప్రతిగా

పసుపు పులుముకుని దీవెనార్థులు కురిపిస్తుంది


నీడగా దాపునే ఉన్న ఎర్ర మందార సెట్టు 

రంగుల పుప్పొడిని అత్తరుగా జల్లుతుంది


ఇంటికి ఎనకాతల 

పసుపు అంగీలు ఎసుకున్న పసిపోరగాళ్ళ సంకనేసుకున్న నిమ్మ చెట్టు కానొస్తుంది


చిలక కోరుకుతున్న జామ పండు

బుక్క బుక్కకు నెలల సందమామకు జన్మనిస్తుంది

ఆ జామ చెట్టు పూట పూటకు వేల పచ్చురాల ఆకలి కడుపుల పెల్లై మురిసి పోతుంది


ఇస్వాసానికి పేరైన కుక్క పిల్ల

పాతవడ్డా జాలి అరుపుల జాబు పంపుతది 


మా ఓనరమ్మ బొట్టు వెట్టిన గడప లెక్క

మోచేతికి అందోచ్చిన పిల్లలు 

ఉర్రు ఖర్చులు తగ్గియ్యూర్రి అని 

తన అనుభవాల పొట్లం చేతిల పెడ్తది


మాట గట్టిదనమె గాని మనసు ఎన్నెల పూత మా ఒనరంకుల్

పెరట్లో ఉన్న కొబ్బరి సెట్టొలె నవ్వితే పాల నీళ్లు కుడుస్తాడు


అద్దెకు ఉన్నామన్న మాటే కానీ

అందమైన నవ్వుల సావిడి ఈ ఇల్లు...!


ఈ ప్రేమల ముల్లె నెత్తినేసుకుని ఇంట్లకు పోతే

పసుపు కొమ్ముకు కళ్లు చెవులు ఒత్తినట్టు

పాల పోర్క నడుముకు తిప్పుకున్న  जोरू ఎదురొచ్చి

నవ్వుల పువ్వులను నెత్తిన కుమ్మరిస్తుంది


ఆ నవ్వుల లేపనాన్ని ఇంట్ల ప్రతి గోడకు పూసిందేమో

చలువ గాలుల హాయి వీస్తుండగా నిద్ర పువ్వును కప్పుకుంటాను...!


రచన : తాజ్

9581114146

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...